Sridhar: ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం 4 d ago
TG : నగరంలోని ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ మోసం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ....
"పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి ఏడాదిలో చేయమంటే ఎలా..? ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఓవర్సీస్ ఉపకార వేతనాలను ఎక్కడ ఆపలేదని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు సభను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి" అని చెప్పారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నేతలు వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారని అన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళితబంధు, ఈ-కార్ రేసుల్లో కమీషన్లు తీసుకున్నారన్నారు.
అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామన్నారు. మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సీనియర్ సభ్యులు కొత్త సభ్యులకు నేర్పించేది ఇదేనా? అని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.